దయ్యం!
2612
3
|   May 06, 2017
దయ్యం!

‘అమ్మా నేను లావణ్య తో ఎందుకు మాట్లాడటం మానేశానో తెలుసా? ’ ఉన్నట్టుండి పరీక్షకు చదువుకుంటున్నదల్లా తలెత్తి నన్ను అడిగింది ప్రియ. లావణ్య ప్రియకు ఐదో క్లాసులో క్లాసు మేట్ ఇంకా మంచి స్నేహితురాలు.

తెలియదు అన్నట్టు తల ఊపి ‘ఎన్నిసార్లు అడిగినా చెప్పలేదుగా, నువ్వు హిరణ్ మంచి స్నేహితులుగా కొనసాగారు , కాని నువ్వు లావణ్య మాట్లాడుకోవటం మానేశారు’ అన్నాను. బాగా పొద్దుటినించి చదివి చదివి దాని బుర్ర వేడెక్కిపోయినట్టుంది, ఈ విషయం మధ్యలో ఎందుకు గుర్తుకొచ్చిందో. 

ప్రియ చిన్నప్పటి నుండి అంతే, నాకు చెప్పకుండా ఏ విషయం దాచదు, కాని దాని మూడ్ బాగుండాలి చెప్పటానికి. లావణ్య విషయం ఇప్పటిదాకా చెప్పలా పోనీ తనకిష్టమయినపుడే చెప్పని అని నేను వత్తిడి చేయలా, ఏవో పిల్లల తగవులు అంత సీరియస్ విషయం కాదులే అని సర్దిచెప్పుకున్నా. ప్రియ ఇపుడు ఇంటర్ సెకండ్ ఇయర్. ఇప్పటికి చెప్తోంది ఐదో క్లాసు సంగతి. ప్రియ ఐదో క్లాసు కొచ్చే ట్టప్పటికే తనకి అది నాలుగో స్కూలు. నా జాబ్ ట్రాన్సఫర్ రీత్యా తను అన్ని స్కూళ్ళు మారాల్సి వచ్చింది. నే జాబ్ చేయటం ఇంకా ఇంట్లో చూసే పెద్దదిక్కు లేకపోవటంతో ప్రియ రెండున్నర వయసుకే ప్లే స్కూల్ లో జాయిన్ అయింది. ప్రియ వెళ్ళే మొట్టమొదటి స్కూల్, నాకు అది బడికి వెళ్తోంది అనే వూహ ఏంటో ఉద్వేగానికి గురిచేసింది. మేం ఉంటున్న ఇంటికి దగ్గరలోనే ఉంది ఆ స్కూల్. 

నా అభిప్రాయం ప్రకారం అదొక అందమైన స్కూలు. ప్లే స్కూల్ అని పేరు పెట్టారు అక్షరాల అది ప్లే స్కూలే. ఎంచక్కా చిట్టి చిట్టి అడుగులతో ప్రియ వెళ్ళగానే ప్రిన్సిపాల్ ఆప్యాయంగా ఎత్తుకుని తన ముందు టేబుల్ మీద కుర్చోపెట్టుకున్నారు. ప్రియతో రోజూ స్కూల్ కి వస్తే పంజరంలో పక్షులు, కుందేళ్ళు చూపిస్తాననీ, జారుడు బల్ల మీద జారుతూ ఆడుకోవచ్చనీ, ఊయల ఊగోచ్చనీ చెప్పి మొదటి రోజు స్కూలుకి వచ్చిందని ఒక చాక్లెట్ కూడా బహుమానంగా ఇచ్చారు. స్వాగతించడానికి అంతకంటే మంచి పధ్ధతి ఇంకేం ఉంటుందనిపించింది. నిజానికా ప్రిన్సిపాల్ ఒక కార్పొరేట్ స్కూల్ లో ఫుల్ టైం టీచర్ గా చేసేవారు. చిన్నపిల్లలంటే ఉన్న ఆసక్తి వల్ల రిజైన్ చేసి ప్లే స్కూల్ మొదలుపెట్టారు. ఒక విశాలమైన ఇంట్లో చూడటానికి చాల ముచ్చటగా ఉండేది స్కూల్. 

అంత చిన్న పిల్లలు ఆ వయసుకే కాన్ఫిడెంట్ గా స్టేజి మీద ఆటలు పాటలు డాన్సులు, కధలు చెప్పటం రైమ్స్ పాడటం ఒకటేమిటి పిల్లలు చేయలేనిది లేదు అనిపించేట్టు తయారు చేసేవారు ఆమె. ఇంకా నా మనసుకు హత్తుకున్న విషయం ఏంటంటే పిల్లల అమ్మ, నాన్న, గ్రాండ్ పేరెంట్స్ ఎవరు వచ్చి స్కూల్ ముందు నిలపడ్డా ఆ పిల్లో పిల్లవాడో ఎవరైతే వాళ్ళ పేరు పెట్టి వెంటనే మీ వాళ్ళు వచ్చారు రమ్మని పిల్చేవారు, వందమంది పిల్లలు ఉంటే అంతమంది పేరెంట్స్ ఎంత చక్కగా గుర్తుండేవారో!! చాల ఆశ్చర్యంగా ఉండేది నాకు. ఒకటో క్లాసు దాకా సజావుగా అదే స్కూల్ లో గడిచిపోయింది. నాకు ట్రాన్సఫర్ అయి వేరే వూరు వెళ్ళాల్సి వచ్చింది. ఇలాంటి అందమైన బడిని వదిలేసి వెళ్ళాల్సి వచ్చినందుకు నే పడిన బాధ వర్ణనాతీతం. నే కొత్తగా వెళ్ళింది ఓ పల్లెటూరు, ప్రియ సాధారణంగానే అలవాటైన, అందులోనూ అంత మంచి బడి వదిలి వెళ్ళాల్సి వచ్చినందుకు చాల ఫీల్ అయింది. కొత్త బడిలో ఏమంత ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ లేవు. మొదటినుండి ఉన్న పిల్లలకి కాస్త శ్రద్ధగా చెప్పి తనని నలుగురితో ఒకరుగా చూసేవారు, పాపం తనకు చాల ఇన్సెక్యూరిటీ అనిపించేది. ఆ బడికి వెళ్ళటానికి చాల దూరం, పైగా రైల్వే ట్రాక్ దాటి వెళ్ళాలి, ఇంకా సరైన ట్రాన్స్ పోర్ట్ లేక, మూడు నాలుగు తరగతులు ఇంటి దగ్గరే ఉన్న మరో బళ్ళో చేర్పించాను. ఈ బడి లో కూడా అంత శ్రద్ధ లేదు కాని ప్రియ రాటుదేలింది, పట్టించుకోపోయినా ఫర్వాలేదు అనుకోవాలని తన చిన్ని మనసుకు తెల్సిపోయింది. ఐదో క్లాసు కి వచ్చేప్పటికి మళ్లీ ట్రాన్స్ఫర్ మళ్లీ స్కూల్ మార్పు తప్పదు, నాకు ఫార్మాలిటీస్ కంప్లీట్ చేస్కునేసరికి ఓ నెల ఆలస్యమయింది, నా ఫ్రెండ్ కొత్త స్కూల్ ప్రిన్సిపాల్ దగ్గరికి తీస్కెళ్ళి నేను ఈ నెల్లాళ్ళు చెప్పిన సిలబస్ నోట్స్ రాసే ఒప్పందం మీద సీట్ ఇస్తామన్నారు, నా ఫ్రెండ్ పిల్లలిద్దరూ మొదటినుండి అదే స్కూల్. అదొక సెమి గవర్నమెంట్ స్కూల్, ఎంప్లాయీస్ పిల్లలకు నామినేటెడ్ ఫీజు తో పాఠాలు చెప్తారు కాని టీచర్లు ఎవరూ పిల్లల మీద వ్యక్తిగత శ్రద్ధ చూపించరు. అల్లరి చేసినా చూసీ చూడనట్టు ఉదాసీనంగా ఉంటారు. స్కూల్ కి స్కూల్ కి మధ్య ఎందుకిన్ని తేడాలు? టీచర్ల మనసుల్లొ ఇన్ని భేదాభిప్రాయాలు? ఎందుకు అన్ని బళ్ళల్లో ఒకటే పాలసీ ఇంకా నార్మ్స్ ఫాలో అవరు? సమాజం మీద, భవిత మీద శ్రద్ధ వహించకపోతే అభివృద్ధి ఇంకా వికాసం ఎలా సాధ్యం? అందరికీ అన్నీ అనుకూలంగా ఉండవు కాని ఒక మంచి బడి ,మంచి టీచర్ వ్యక్తిత్వ వికాసానికి సామాజిక వికాసానికి కనీస అవసరంగా నేననుకుంటాను. ఓ నెలరోజులు ఆలస్యం అయ్యేసరికి అందరి దృష్టి ప్రియ మీదకు మళ్ళింది, చాలామందే స్నేహితులయ్యారు. హిరణ్, లావణ్య, రేష్మ, పూజిత, గ్లోరీ, కే.లత, టి.లత ,రోజా ఈ పేర్లన్నీ ఇప్పటికి గుర్తే నాకు. 

లావణ్య, హిరణ్ చాలా చాలా స్నేహంగా ఉండేవారు ప్రియతో కాని ఉన్నట్టుండి లావణ్య ప్రియతో మాట్లాడటం మానేసింది. అపుడపుడు ఇంటికి ఆడుకోవడానికి వచ్చి నేనేదయినా చేసిపెడితే తిని వెళ్ళే పిల్ల అసలు రావటమే మానేసింది. ఏమైందని అడిగితే ప్రియ కూడా మాట్లాడలా. ఏదో ఒక సందర్భంలో ఎపుడో ఒకపుడు మాటల్లో పెట్టి అడగాలని ప్రయత్నించినా ప్రియ ఏమీ చెప్పలా నాతో. ఆ విషయం నా మనసులో మరుగున పడిపోయి ఉండిపోయింది అలాగే, ఇదిగో ఇప్పుడు ప్రియ అన్న మాటలకి సడన్ గా గుర్తుకొచ్చింది. 

చెప్పు అన్నట్టు చూశా. ‘నేను కొత్తగా స్కూల్ లో ఐదో క్లాసు జాయిన్ అయినప్పుడు లావణ్య, హిరణ్ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. కొత్తగా చేరితే అందరికి చేరినవాళ్ళ మీద కాస్త ఆసక్తి ఎక్కువ ఉంటుందిగా అందుకే చాలామంది నన్ను పలకరించి ఫ్రెండ్స్ అయ్యారు’. ‘అమ్మా స్కూల్ మారిన ప్రతిసారి ఐ హావ్ బీన్ బుల్లీడ్ తెల్సా నీకు? నే అందరితో బాగానే ఉండేదాన్ని, సమానంగానే మాట్లాడేదాన్ని. 

కాని కొంతమంది చాల విచిత్రంగా ప్రవర్తించేవాళ్ళు. వాళ్ళల్లో కే.లత నెంబర్ వన్. నే రాకముందు లత ఇంకా లావణ్య మంచి ఫ్రెండ్స్, నే వచ్చాక నాతో లావణ్య క్లోజ్ గా ఉండటం సహించలేకపోయింది కే. లత. ఓ రోజు నన్ను పిలిచి ప్రియా నీకు తెల్సా లావణ్య బెస్ట్ ఫ్రెండ్ ఎవరో అంది, తెలీదన్నా, నేనే అంది. ఆ విషయం నీకు ప్రూవ్ చేయనా అంది, నే అవునూ కాదూ అన్నట్టు తలూపితే టి. లత ని పిల్చి ప్రియని లావణ్య దగ్గరకి తీస్కెళ్ళి తన బెస్ట్ ఫ్రెండ్ ఎవరో ప్రియతో చెప్పమను అంది కమాండింగ్ గా. అందరం వెళ్ళాము అపుడు లావణ్య బెరుకుగా చూస్తూ కే. లత అని సమాధానం చెప్పింది. ఇంకా నువ్వు ఎంత క్లోజ్ గా ఉన్నా నువ్వు తన బెస్ట్ ఫ్రెండ్ అవలేవు అంది నాతొ, ఇంకా లావణ్య ను ప్రియ తో మాట్లాడితే నీతో ఇంక మాట్లాడను అని బెదిరించింది. కే. లత అప్పటికే క్లాసు లో రౌడీ లా బిహేవ్ చేస్తోంది, ఎందుకొచ్చిన గొడవరా నాయనా అని లావణ్య నాతో మాట్లాడటం మానేసింది. కే. లత ఆగడాలు అన్నీ ఇన్నీ కావు, ఓ రోజు అరవింద్ తన బాగ్ పైకి తెమ్మంటే తేలేదని వాడు కూచునే చోట బెంచ్ లో రాజేష్ చేత జామెట్రీ బాక్స్ లో డివైడర్ మొన పైకి ఉండేటట్టు పెట్టించింది. వాడు చుస్కోకుండా కూచుని ఒకటే లబో దిబో పాపం రక్తం వచ్చి ప్రిన్సిపాల్ దాకా వెళ్ళింది కంప్లైంట్, కాని ఎవరు మాకు తెలీదంటే మాకు తెలీదని బయటపడలేదు. 

ఇంకా రవి కొత్త వాచ్ బెంచ్ డెస్క్ లో పెట్టుకుంటే అది దాచేసింది. అది వాళ్ళ మామయ్య అమెరికా నుండి తెచ్చిన గిఫ్ట్ అని వాడు వారంరోజులు ఏడుస్తూ కూచున్నాడు. ఎవరైనా తనే చేసిందంటే నాటకంగా ఏడుస్తూ దేవుడి మీద ఒట్టు టీచర్ నే కాదు అనేది వెతికినా వస్తువులు దొరికేవి కావు ఎక్కడ దాచేదో అంతుచిక్కేది కాదు. నా పౌచ్ లావణ్య బాగ్ లో దాచి టీ . లత తో వెతికించి, లావణ్య బాగ్ లోంచి తీయించి, తనే కావాలని తీసిందని నాకు ఇంకాస్త తనమీద కోపం పెరిగేలా చేసింది. హాఫ్ ఇయర్లీ పరీక్షలు రేపనగా రేష్మ హిందీ నోట్స్ దాచి చింపి గోడ అవతలకు విసిరేసింది, రేష్మ ఎగ్జామ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇంట్లో ఏమంటారో అని వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది ఆ రోజంతా. కే. లత ఆగడాలు అన్నీ ఇన్నీ కావమ్మా అప్పుడు అంది ప్రియ. ఆరోగ్యకరమయిన వాతావరణం లో ఉండాల్సిన బడిలో ఈ గడుగ్గాయి ఇన్ని ఆగడాలు చేసిందా? ఎవరూ సరయిన చర్య తీస్కోపోవటం చాలా బాధగా ఇంకా కోపంగా అన్పించింది నాకు. ప్రియ మొట్టమొదట వెళ్ళిన బడికీ ఈ బడికీ ఎంత తేడా?! 

చివరకు కే. లత విషయం మేము ఏం చేసామో తెల్సా అంది ప్రియ, ఇప్పటికయినా నువ్వు చెప్తేనే కదా తెల్సేది అన్నా నిష్టూరంగా. బలవంతమైన సర్పము చలి చీమల చేత చిక్కి….. సుమతి శతకంలో లాగా, కే. లత కి వీక్ పాయింట్ కనిపెట్టాం. తనకి దయ్యాల పేరు వింటే విపరీతమయిన భయం. మాములుగా మేము నవ్వులాటగా దయ్యాల గురించి మాట్లాడుకున్నా భయంతో దూరంగా వెళ్ళేది. నేను హిరణ్ కలిసి ప్లాన్ వేశాము. కే .లత దగ్గరకు వెళ్లి నీ గురించి ఎవరో మాకు రోజూ ఫోన్ చేస్తున్నారు, ఎవరంటే పేరు చెప్పటం లేదు, పదే పదే కే. లత మీ స్కూలే నా అని అడుగుతున్నారు. నిన్న రాత్రి ఫోన్ చేసినప్పుడు పేరు చెప్పమని గట్టిగా అడిగితే దయ్యాలకు అందమయిన పేర్లే ఉంటాయనీ అందమయిన పేర్లు ఉన్నవాళ్ళే దయ్యాలవుతారని తన పేరు శ్రావ్య అని చెప్పిందని అన్నాము. ముందు కొట్టిపారేసినా కే. లత బాగా భయపడిపోయింది, మేము ఓ పదిరోజులు వరసగా ఫోన్స్ వస్తూనే ఉన్నాయని తనని ఏడిపించాము. శ్రావ్య దయ్యం నీ గురించి రోజూ రాత్రిపూట ఫోన్ చేస్తోంది, నువ్వు కావాలంటోంది, నువ్వు ఏం చేస్తున్నావని అడుగుతోంది, మీ ఇల్లు ఎక్కడ అని అడుగుతోంది అని దాని బుర్ర తినేశాము. తర్వాత తన ఆగడాలు చాలా మటుకు తగ్గాయి. కాస్త ముడుచుకుని కుచునేది ఇంకా ఎవరితో మాట్లాడేది కాదు. మాకు కాస్త మనశ్శాంతి దొరికింది. ఇదంతా చెప్పి ముగించింది ప్రియ. ఎంత అల్లరి ఆగడం చేసినా పిల్లలు పిల్లలే కదా. లేత మనసులు. పసి వయసులో ఏమి జరిగినా అవి మనసులో ముద్రించుకు పోతాయి. ప్రియ కూడా క్రమశిక్షణ తో వొద్దికగా ఉండే పిల్ల ఇంతకు తెగించేసి అట్లా భయపెట్టింది ఆ అమ్మాయిని.?! ఇన్ని రోజులు వీళ్ళిద్దరూ గుంభనం గానే ఉన్నారు నాతో. ఎంత చక్కగా ఆడుతూ పాడుతూ ఉండాల్సిన వయసులో ఇన్ని స్పర్ధలు ఇంత కల్మషం మనస్సులో. ఎవరు వహిస్తారు బాధ్యత? కనీసం పేరెంట్స్ కి కూడా చెప్పలేనంత బాధ పడ్డారన్నమాట వీళ్ళు. మాకు తెలిస్తే మేమయినా టీచర్స్ తో విపులంగా మాట్లాడి ఓ పరిష్కారం వెతికే వాళ్ళమేమో అన్పించింది. ఆపదలకు ఎదురొడ్డే ధైర్యం వీళ్ళకు వచ్చిందని సంతోషించాలా, దుష్పరిణామాలు ఆలోచించకుండా వీళ్ళు చేసే పనులు, తీస్కునే నిర్ణయాలకు చింతించాలో పాలు పోలేదు నాకు. ఏ దెబ్బలకు మనుషుల మనస్సులో దయ్యాలు పారిపోతాయి??!

Read More

This article was posted in the below categories. Follow them to read similar posts.
LEAVE A COMMENT
Enter Your Email Address to Receive our Most Popular Blog of the Day