మానసిక ఒత్తిడిని ఎదుర్కునేది ఎలా ?
3087
2
|   May 11, 2017
మానసిక ఒత్తిడిని ఎదుర్కునేది ఎలా ?

         మానసిక ఒత్తిడి , ఇది ఏ ఒక్క వ్యక్తి సమస్య కాదు ,నేటి సమాజములో చిన్న పిల్లవాడు మొదలు నా వరకు అందరూ అనుభవిస్తున్న వేదనే .అసలు ఏమిటి ఈ మానసిక ఒత్తిడి ?మా తాతగారి నోట నేనెపుడూ వినలేదే .అరవై ఏళ్ల క్రితం దీనికి రూపమే లేదు. కానీ, నేడు ఎవరి నోట విన్నా కుటుంబానికి కనీసము ఒకరు ఖచ్చితముగా ఈ సమస్య తో బాధపడుతున్నారు ముఖ్యముగా ఆర్జించేవారు.

         నా వరకు వస్తే కాని మానసిక ఒత్తిడి అంటే అర్ధం తెలియలేదు. అసలు ఆ ఒత్తిడి లో ఉన్నానన్న విషయమే నాకు స్పురించలేదు అయితే ఈ సమస్యకు పరిష్కారమే లేదా?మందుబిల్లలే పరిష్కారమా! ఎంతకాలము .........ఈ  ప్రశ్నలన్నీ నన్ను నిలువనీయలేదు ........రాత్రి,పగలు ఆలోచించాను,సమస్య అర్ధమయింది. నెమ్మదిగా మనసు స్థిమితపడింది.

          ధ్యానము చేశాను సమస్యకు మూలాన్ని కనుగొన్నాను పరిష్కారాన్ని తెలుసుకున్నాను అమలు పరిచిన తరువాత నన్ను నేను తలచుకుని నవ్వుకున్నాను ఇంత చిన్న సమస్య కా నేను ఇంత ఒత్తిడికి లోనయ్యాను నా వలన నా భర్త, పిల్లలు వేదనకు గురయ్యారు .ఇప్పుడు నేను సంతోషముగా ఉన్నాను .

          నేడు అందరూ ఎదుర్కుంటున్న సమస్యల లో కొన్నింటిని పరిశీలిద్దాము.

 1.ఇరువురి సంపాదన 

           ఒకప్పటి ఉమ్మడి కుటుంబాల  స్థానము లో నేడు ఒంటరి కాపురాలు చోటుచేసుకున్నాయి. ఉమ్మడి కుటుంబము లో సమస్య వస్తే పరిష్కారానికి అందరూ ప్రయత్నించేవారు, సంపాదించేవారు ఎక్కువే ,కానీ నేటి కుటుంబాలలో సమస్యా భారం మొత్తం ఒక్కరిదే అందుకే ఒత్తిడికి లోనవుతున్నారు. అయితే పరిష్కారము లేదా,ఉమ్మడికుటుంబమే పరిష్కారమా?కాదు మనం అలా అనుకోకూడదు మన సమస్య ఉన్న చోటే పరిష్కారము కూడా ఉంటుంది.

           కుటుంబములో నలుగురు ఉన్నారు.అందులో సంపాదించేవారు ఒక్కరే అయితే ,మిగిలిన వారు సంపాదించే స్థోమత ఉన్నవారయితే వారికి కూడా పని చేయమని చెబుదాము లేదా ఉన్నంతలో సర్దుకుపోదామని వివరిద్దాము. వారము మొత్తము వంటరిగా మనమే కాలము గడపకున్న ఒక్క రోజు మన కుటుంబ సభ్యులందరిని కలిసి వాళ్ళతో గడుపుదాం. మన కష్టసుఖాలను వాళ్ళతో పంచుకుందాము ,అప్పుడు మన మనస్సు తేలిక పడుతుంది.కేవలము మనము మాత్రమే హోటల్ కి లేదా  సినిమాలకి వెళ్ళి కాలము గడిపే కన్నా అమ్మానాన్న,నాన్నమ్మతాతయ్య ఇలా ఎవరు వీలయితే వాళ్ళను కలుద్దాము ,లేదా వాళ్ళను మన ఇంటికి పిలుద్దాము. కొన్నిసార్లు ఇలా ప్రయత్నిద్దాము ఫలితము తప్పక ఉంటుందని నా నమ్మకం.

2.పిల్లలలో వ్యక్తిత్య వికాసము

        అలాగే చదువు కుంటున్న పిల్లల్లో కూడా చాలా మంది ఈ ఒత్తిడికి గురవుతున్నారు.మన చిన్న తనములో చదువుతో పాటు ఆటలు ఆడుకునేవాళ్ళము, స్నేహితులతో కాలము గడిపేవాళ్లం ,కానీ నేడు పిల్లలకి చదువుచదువు అని పాఠశాలలోన ,మనము ఇంట్లోన ఒత్తిడి చేస్తున్నాము. పాఠశాలలో ఆడడానికి స్థలము కూడా ఉండడము లేదు.అయితే దీనికి పరిష్కారము మనమే పరిశీలిద్దాము ,ఈ పోటీ ప్రపంచములో మన పిల్లలు బాగా చదువుకోవాలని ఆశిస్తాము కానీ చదువుతో పాటు కొన్ని కొన్ని మార్పులు చేసి వాళ్ళ  వ్యక్తిత్వ వికాసం వికసింప చేద్దాము ,సెల్ ఫోన్లలో ఆటలాడే మన పిల్లలని బయటకి పంపించి ఆడమని ప్రోత్సహిద్దాము ,వాళ్ళని స్నేహితులతో గడపనిద్దాము వాళ్ళ చదువు పాడవుతుందనే ఆలోచన పక్కన పెట్టి మనతో పాటు అన్ని శుభకార్యాలకు తీసుకు వెళదాము ,పిల్లల కోసం తమ సంతోషాలను ఆపుకుని ఎక్కడికి వెళ్లకుండా ఉన్నవారు మన లోనే చాలామంది ఉన్నారు,ఈ ధోరణి మార్చుకొని అన్నింటికీ కాకపోయిన వీలయిన వాటికి పిల్లలని తీసుకువెళదాము మనము ఆనందిద్దాము అప్పుడే మన పిల్లలకి నలుగురితో కలివిడిగా ఎలా ఉండాలి ,కష్టసుఖాలు అన్నీ  అవగతమవుతాయి .

3.బార్యభార్యల మధ్య అనుబంధం 

         ఇప్పుడు భార్యాభర్తల మధ్య ఒత్తిడి చర్చిద్దాము.నేడు ఈ సమస్య చాలా ఎక్కువ ఉందనే చెప్పాలి,ఒకప్పుడు భర్త సంపాద న కు బయటకు వెళితే భార్య ఇంట్లో ఉంటూ సంసారాన్ని చక్కదిద్దుకునేది ,కానీ నేటి కాలము లో అలా కాదు భార్యాభర్త ఇరువురు సంపాదిస్తే కానీ ఐదువేళ్ళు నోటిలోపలికి వెళ్లలేని పరిస్థితి ,అందువలన భార్య పై ఒత్తిడి పెరిగి వైవాహిక జీవితము ప్రభావిత మవుతుంది, మరి ఎలా ?.............., వారానికి ఐదు రోజులు పని చేద్దాము,మిగిలిన రెండు రోజులు ఎక్కడికో దూరపు ప్రాంతాలకో విహారయాత్రలకో మాల్స్ కో వెళ్లకుండా ఒక రోజు పిల్లలతో గదుపుదాము ఒక రోజు భార్యాభర్త ఇరువురు మనసు విప్పి మాట్లాడుకోవడానికి ప్రయత్నిద్దాము, ఒకరి అభిరుచులను ఒకరు గౌరవిద్దాము మనసెరిగి మనుగడ సాగిద్దాము వారాంతములో ఒకరికి ఒకరు ఎదురయిన సమస్యలు చర్చించుకుని ఒత్తిడిని దూరము చేసుకుందాము, పెళ్లిరోజులకి పుట్టిన రోజులకి హోటళ్లలో కాకున్నా ఆత్మీయుల మద్య  జరుపుకుందాము.

4.కుటుంబ సభ్యుల మద్య అవగాహన పెంచడం

         చదువుకునే పిల్లలకు, తల్లితండ్రులకు మధ్య సరైన అవగాహన లోపించడము వలన పిల్లలు మానసిక ఒత్తిడికి గురి అవుతున్నారు, తోటి పిల్లలతో పోల్చి ‘’ప్రక్కింటి శర్మ గారి అమ్మాయిని చూడు 98% మార్కులు తెచ్చుకుంది ,నీ సునీత  అత్త కొడుకుని చూడు వాడికి ఐ‌ఐ‌టిలో సీటు వచ్చింది “...ఇలా చాలా రకాలుగా వారి మీద ఒత్తిడి తీసుకువస్తున్నాము, వారి ప్రజ్ఞాలబ్ధి [ఐ.క్యూ ]పరిగణలోకి తీసుకోకుండా ఇది చదువు,ఇలా చదువు అని మన అభిప్రాయాలను అమాంతం ఆ పసివాళ్ళ మీద ఒత్తిడి తీసుకువస్తున్నాము,ఈ సందర్భాలలో ఆ పసిమనసులు ఎంతో వేదనకు గురి అవుతున్నాయి .తల్లితండ్రులుగా మేము అన్ని  సౌకర్యాలు కల్పించి చదువుకోమని ప్రోత్సహిస్తుంటే ఎందుకు చదవరు అని మనము బాధ  పడుతూ పిల్లల్ని బాధ  పెడుతున్నాము,మా చిన్తతనములో ఇలా ఉండేవాళ్లం,అలా చదివేవాళ్లం అని వాళ్ళని ఒత్తిడికి గురిచేస్తుంటాము ,దాని ప్రభావము వాళ్ళ ఎదుగుదలకు అవరోధాన్ని కలిగిస్తుంది

తల్లితండ్రులుగా మనము నేటి పరిస్థితులను,పిల్లల మానసిక స్థితిని ఎరిగి కొన్ని మార్పులు చేసుకుంటూ, పిల్లలలో మార్పును తీసుకురాగలము, చిన్నిచిన్ని ప్రయత్నాలు చేసి వాళ్ళ మానసిక ఒత్తిడిని దూరము చేద్దాము, మన చేతి కున్న ఐదు వేళ్ళు ఒకేలాగా ఎలాగయితే ఉండవో మనిషి మనిషి కీ మధ్య ఆలోచనా పరిజ్ఞానము,శక్తి సామర్ధ్యాలు వేరువేరుగా ఉంటాయి. కనుక ప్రప్రధమ ప్రయత్నముగా పిల్లలని వాళ్ళ తోడపుట్టిన వాళ్ళతో సహా ఎవరితోనూ మనము పోల్చవద్దు ,కానీ ‘’నువ్వు చెయ్యగలవు, నీలో ఆ శక్తి ఉంది,నాకు నీమీద నమ్మకం ఉంది’’ ఇలాంటి ఉత్సాహపరిచే మాటలతో వాళ్ళని ప్రోత్సహిద్దాము .                                              

               పిల్లలు చదువులోనే కాదు వివిధ రంగాలలో ఆసక్తి కనబరుస్తుంటారు,నలుగురిలాగానే నీవు అదేబాట లో వెళ్ళు అనేకన్నా వాళ్ళు నచ్చిన రంగములో వాళ్ళ ప్రతిభను కనబరిచే అవకాశము ఇద్దాము ,చదువుతో పాటు వ్యక్తిత్వ వికాసము చాలా అవసరము, ఈ పోటీ ప్రపంచములో పిల్లలు ఎంత పరుగెడుతున్నారో అనే అంశము కన్నా ఎటువైపు పయనము సాగిస్తున్నారో అనే అంశానికే ప్రాధాన్యతను ఇద్దాము.

              ఈవిధముగా ఒత్తిడి దూరము చేసుకోవడానికి మన వంతు ప్రయత్నిద్దాము మానసికఒత్తిడి పై విజయము సాదిద్దాము.

 

 

Read More

This article was posted in the below categories. Follow them to read similar posts.
LEAVE A COMMENT
Enter Your Email Address to Receive our Most Popular Blog of the Day